మళ్లీ దగ్గరవుతున్న భారత్–చైనా
న్యూఢిల్లీ,వార్త నేత్రం ప్రతినిధి:
భారత్–చైనా మధ్య సంబంధాల్లో క్రమంగా కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్థాన్ గగనతలాన్ని భారత విమానాలకు మూసివేయడంతో పశ్చిమ దేశాలకు వెళ్లే విమానాలు సుదీర్ఘ ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో ఇంధన వినియోగం, ప్రయాణ సమయం, నిర్వహణ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్.. చైనాలోని జిన్‌జియాంగ్ గగనతలాన్ని ప్రత్యామ్నాయ మార్గంగా వినియోగించుకునే అంశంపై చర్చలు జరుపుతోంది.భారత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్‌మోహన్ నాయుడు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. చైనాలోని హోటాన్ మీదుగా ప్రత్యామ్నాయ విమాన మార్గంపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, విదేశాంగ మంత్రిత్వ శాఖ చైనా అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని ఆయన తెలిపారు. అయితే ఈ మార్గానికి సంబంధించి ఇప్పటివరకు తుది ఒప్పందం కుదరలేదని, ప్రారంభ తేదీ కూడా ఖరారు కాలేదని స్పష్టం చేశారు.
పాక్ గగనతల నిషేధంతో పెరిగిన భారం
2025 ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ భారతీయ రిజిస్ట్రేషన్, నిర్వహణ లేదా లీజు కింద ఉన్న విమానాలకు తన గగనతలాన్ని మూసివేసింది. దాంతో భారత్ నుంచి యూరప్, బ్రిటన్, ఉత్తర అమెరికా వైపు వెళ్లే పలు విమానాలు పాకిస్థాన్‌ను తప్పించుకుని అరేబియా సముద్రం మీదుగా సుదీర్ఘ మార్గాలను అనుసరిస్తున్నాయి. ఈ మళ్లింపు కొన్ని మార్గాల్లో విమాన ప్రయాణ సమయాన్ని సుమారు 45 నిమిషాల నుంచి రెండు గంటల వరకు పెంచుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
హోటాన్ మార్గం ఎలా ఉండొచ్చు?
చర్చలు ఫలిస్తే ఢిల్లీ, ముంబై వంటి నగరాల నుంచి పశ్చిమ దిశగా వెళ్లే విమానాలు లేహ్ వైపు ప్రయాణించి, చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంలోని హోటాన్ సమీపంలో చైనా గగనతలంలోకి ప్రవేశించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అక్కడి నుంచి మధ్య ఆసియా మీదుగా యూరప్, బ్రిటన్, ఉత్తర అమెరికా దిశగా ఉన్న అంతర్జాతీయ విమాన మార్గాలతో అనుసంధానం చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.
సంబంధాల మెరుగుదలకు సంకేతమా?
భారత్–చైనా మధ్య 2020 సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత సంబంధాల్లో తీవ్ర ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి సంప్రదింపులు, దౌత్య సంబంధాలు పునరుద్ధరించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. సెప్టెంబర్‌లో బ్రిక్స్ సమావేశానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటించిన నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలపై మరోసారి దృష్టి పడింది.అయితే హోటాన్ విమాన మార్గంపై జరుగుతున్న చర్చలను నేరుగా ద్వైపాక్షిక సంబంధాల్లో పెద్ద మార్పుగా భావించడానికి ఇంకా సమయం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఇది ప్రధానంగా పాకిస్థాన్ గగనతల నిషేధం వల్ల భారత విమానయాన సంస్థలపై పడుతున్న సమయం, ఇంధనం, నిర్వహణ వ్యయాలను తగ్గించేందుకు భారత్ అన్వేషిస్తున్న ప్రత్యామ్నాయ విమాన మార్గంగానే కొనసాగుతోంది.

Comments
Post a Comment