ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్
హైదరాబాద్, డిసెంబర్ 12 వార్త నేత్రం ప్రతినిధి : ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని డిమాండ్ చేస్తూ సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిల్) పిటిషన్ దాఖలు చేశారు. భారత రాజ్యాంగం 32వ ఆర్టికల్ కింద అక్టోబర్ 14న ఈ పిటిషన్ సమర్పించగా, అది దాఖలైనది త్వరలో విచారణకు వస్తుందని తెలిపారు. ప్రభుత్వం అభివృద్ధి, పథకాల కోసం ఎంత నిధులు కేటాయిస్తోంది, వాటిని ఎందుకోసం ఖర్చు చేస్తోందో పూర్తి వివరాలు ఇంటర్నెట్‌లో ఉచితంగా అందుబాటులో ఉండాలని అందె రఘు పిటిషన్‌లో స్పష్టం చేశారు. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ద్వారా ప్రతి సారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా స్వచ్ఛందంగా వెబ్‌సైట్‌లలో పొందుపరచాలని కోరారు. ప్రజాధనం ఖర్చుల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంటే ప్రతి రూపాయి ఎక్కడ, ఎందుకు ఖర్చు అవుతోందో ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య పారదర్శకత పెరిగి అవినీతి తగ్గుతుందని వారు తెలిపారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.