లక్ష్యం వైపు అడుగులు వేస్తే విజయం తథ్యం...... మిస్ ఎర్త్ వాటర్ ఇండియా–2026’ విజేత ప్రీతి ముండేకు ఘన సన్మానం
ఆదిలాబాద్, వార్త నేత్రం ప్రతినిధి:
జిల్లాలోని మారుమూల ప్రాంతంలోని సాధారణ కుటుంబం నుంచి జాతీయ స్థాయికి ఎదిగి ‘మిస్ ఎర్త్ వాటర్ ఇండియా–2026’ కిరీటాన్ని కైవసం చేసుకున్న ప్రీతి ముండే విజయం జిల్లాకే గర్వకారణమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనుషాతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రీతి ముండేతో పాటు ఆమె తల్లిదండ్రులు ఉమ, ప్రహ్లాద్‌లను ఘనంగా సన్మానించి అభినందించారు.కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. జిల్లాలోని యువతులు ప్రీతి ముండేను రోల్ మోడల్‌గా తీసుకుని తాము ఎంచుకున్న రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ప్రస్తుత పరిస్థితులను పట్టించుకోకుండా లక్ష్యం వైపు పట్టుదలతో ముందుకు సాగితే విజయం సాధించడం ఖాయమన్నారు. అందంతో పాటు ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ కూడా ఎంతో ముఖ్యమని సూచించారు. సాధారణ కుటుంబాల నుంచే గొప్ప విజయగాథలు వెలువడతాయని పేర్కొన్నారు.ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ.. ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన ప్రీతి ముండే జాతీయ స్థాయి వేదికపై ఆదిలాబాద్ జిల్లా పేరును నిలబెట్టడం అభినందనీయమన్నారు. చదువుతో పాటు సంస్కృతి, పురాణాలు, ఇతిహాసాలపై ఆమెకు ఉన్న విస్తృత అవగాహన విజయానికి దోహదపడిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత తమ ప్రతిభను గుర్తించి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, హీరాపూర్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment