దీపావళి కానుకగా వచ్చిన స్వీట్లలో కల్తీ జరిగితే తెలుసుకోవడం ఎలా..?

వార్త నేత్రం ప్రతినిది :   

దీపావళి వచ్చిందంటే చాలు.. ఏ వీధిలో చూసినా భారీగా స్వీట్లను అమ్ముతుంటారు. చాలా సంస్థలు తమ ఉద్యోగులకు స్వీట్ బాక్సులను కానుకగా ఇస్తుంటాయి. అయితే, ఇలాంటి సందర్భాల్లో స్వీట్లలో కల్తీకి సంబంధించిన వార్తలు కూడా తరచూ వస్తుంటాయి.

ఇటీవలి రోజుల్లో, కల్తీ పాలు, కల్తీ నెయ్యి పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి.

డిమాండ్‌ను అందుకునేందుకు కొందరు స్వీట్లలో కృత్రిమ పదార్థాలను, రసాయనాలను కలిపే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అలా కల్తీ అయిన పదార్థాలు తినడం కచ్చితంగా ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

అందుకే, ఇంట్లోనే ఈ ఆహార పదార్థాలు కల్తీవో, కాదో తెలుసుకునే విధానాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సూచిస్తోంది.



ఖోయా కల్తీ అయిందని గుర్తించడమెలా?

దేశ వ్యాప్తంగా ఏటా దీపావళి సమయంలో ఎఫ్‌ఎస్ఎస్ఏఐ టన్నుల కొద్దీ కల్తీ ఖోయాను సీజ్ చేస్తూ ఉంటుంది.

ఖోయా (కోవా) అనేది పాలతో చేసే పదార్థం. దీన్ని స్వీట్ల తయారీలో ఎక్కువగా వాడతారు. పాలను బాగా మరగబెట్టి ఖోయాను తయారు చేస్తారు.

ఖోయా సాధారణంగా తెలుపు లేదా లేత పసుపు రంగులో ఉంటుంది. కొంచెం తియ్యగా ఉంటుంది.

చాలా సంప్రదాయ స్వీట్ల తయారీలో దీన్ని వాడతారు.

చాలా వరకు గంజి, నెయ్యి, బ్లాటింగ్ పేపర్, చాక్ పౌడర్ వంటివి కలిపి ఖోయాను కల్తీ చేస్తుంటారు.

ఖోయా కల్తీ అయిందని గుర్తించేందుకు చాలా మార్గాలున్నాయి.

అవేంటంటే..

ఒక చెంచా నిండుగా ఖోయా తీసుకుని, దాన్ని వేడి నీటిలో కలపాలి. అందులో కాస్త అయోడిన్‌ వేయాలి.

అప్పుడు ఖోయా నీలం రంగులోకి మారితే, దానిలో గంజి కలిసి ఉన్నట్లు అర్థం.

ఒకవేళ అది నీలం రంగులోకి మారకపోతే, ఆ పదార్థం స్వచ్చమైనదని భావించొచ్చు.

రెండో విధానం..

చిన్న గిన్నెలో కొంత ఖోయాను తీసుకోవాలి. దానిలో సల్ఫరిక్ యాసిడ్‌ను కలపాలి. అది ఊదా రంగులోకి మారితే, అది కల్తీ అయిందని అర్థం.

ఖోయాను కొనేటప్పుడు కూడా దీన్ని గుర్తించవచ్చు.

స్వచ్చమైన ఖోయా ముట్టుకుంటే కాస్త గరుకుగా ఉంటుంది. రుచిచూస్తే తియ్యగానే ఉంటుంది. చేతిపై దాన్ని రబ్ చేస్తే, జిడ్డుజిడ్డు ఏర్పడుతుంది.

దీన్ని కొనేముందు, కొంతమొత్తాన్ని తీసుకుని, అరచేతిలో రబ్ చేసి చూసుకోవాలి. ఇవన్నీ ఉంటే అది స్వచ్చమైనదిగా పరిగణించవచ్చు.

వెజిటబుల్ ఆయిల్‌‌తో అది కల్తీ అయ్యిందేమో గుర్తించేందుకు రెండు టీ స్పూన్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఒక టీ స్పూన్ చక్కెరను శాంపిల్‌కు కలపండి.

అలా చేసిన తర్వాత, ఆ మిశ్రమం ఎర్రగా మారితే, ఖోయా స్వచ్చమైనది కాదని అర్థం



స్వీట్లపై వేసే సిల్వర్ పూతలోనూ కల్తీ

స్వీట్లపై సిల్వర్ పూతను వేయడం ద్వారా, ఆ స్వీట్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దాంతో అమ్మకాలు బాగా పెరుగుతాయి.

అయితే, సిల్వర్ ధరలు పెరుగుతుండటంతో, అది కూడా కల్తీ అవుతోంది. అందులో అల్యూమినియం కలుపుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

నకిలీని గుర్తించడమెలా?

స్వీట్‌పై ఉన్న సిల్వర్‌ పొరను కొద్దిగా తీసుకుని, రెండు వేళ్లతో రబ్ చేయాలి.

ఒకవేళ అది స్వచ్చమైనది అయితే, పౌడర్‌గా మారుతుంది. అల్యూమినియంతో కల్తీ అయితే చిన్నచిన్న ముక్కలుగా విరిగిపోతుంది.



పాలు, పాల పదార్థాలు

దేశంలో పాలు, పాల పదార్థాల కల్తీ గురించి తరచూ వార్తలు వస్తున్నాయి.

కృత్రిమ పాలల్లో యూరియా, డిటర్జెంట్, సోపు, బోరిక్ యాసిడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ తెలిపింది.

ఇలాంటి రసాయనాలు కలిసిన పదార్థాలను తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని పేర్కొంది.

కల్తీ అయిన పాలు, పాల పదార్థాలను చెక్ చేసుకునేందుకు పలు రకాల విధానాలను ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచిస్తోంది.

నీళ్లతో పాలు కల్తీ అయ్యాయని ఎలా గుర్తించాలి?

ఒక ప్లేట్‌పైకి కొన్ని చుక్కల పాలు పోయాలి. ఆ ప్లేట్‌ను ఒక వైపుకు కొంచెం వంచాలి.

ఒకవేళ పాలు కల్తీ కాకుండా ఉంటే, అవి మెల్లగా ప్లేట్ వంచిన వైపు పోతాయి. అలా చేసినప్పుడు, పాలు వేసిన దగ్గర తెల్లటి పొర మిగిలిపోతుంది.

ఒకవేళ నీటితో పాలు కల్తీ అయితే, ప్లేట్ వంచిన వైపుకు త్వరగా వెళ్లిపోతాయి. తెల్లటి పొర కూడా కనబడదు.

పాలలో డిటర్జెంట్‌ను గుర్తించడమెలా?

శాంపిల్‌గా 5 నుంచి 10 మిల్లీ లీటర్ల పాలను తీసుకోవాలి. అంతే మొత్తంలో నీళ్లను కూడా తీసుకోవాలి.

ఈ రెండింటిన్నీ బాగా కలపాలి.

ఒకవేళ పాలల్లో డిటర్జెంట్ ఉంటే, పాలపై మందపాటి నురగ ఏర్పడుతుంది.

కానీ, కలియబెట్టినప్పుడు పలుచని నురగ పొర ఏర్పడితే, ఆ పాలు స్వచ్ఛమైనవిగా భావించొచ్చు.



నెయ్యి కల్తీ అయిందని గుర్తించడమెలా?

సంప్రదాయ మిఠాయి వంటకాల్లో నెయ్యిని ఎక్కువగా వాడుతుంటారు. పండుగల సమయాల్లో సాధారణంగా నెయ్యికి డిమాండ్ పెరుగుతుంది. ఈ డిమాండ్ కారణంతో, మార్కెట్లో కల్తీ నెయ్యి కూడా ఎక్కువగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

నెయ్యి లేదా బటర్ కల్తీ కోసం కొందరు స్వీట్ పొటాటో గుజ్జు, గంజి లాంటి పదార్థాలను కలుపుతుంటారు.

నెయ్యిలో కల్తీని గుర్తించే విధానం..

గిన్నెలో ఒక టీ స్పూన్ నెయ్యిని లేదా బటర్‌ను తీసుకోండి.

అందులో రెండు నుంచి మూడు చుక్కల అయోడిన్‌ను కలపండి.

అప్పుడు అది నీలం రంగులోకి మారితే, తినడానికి పనికిరాదని అర్థం.

నీలం రంగులోకి మారిందంటే, దానిలో స్వీట్ పొటాటోల గుజ్జు లేదా గంజి లాంటి పదార్థాలు కలిశాయని అర్థం.

కుంకుమ పువ్వు కూడా..

కుంకుమ పువ్వు పరిణామాన్ని పెంచడం కోసం కృత్రిమ రంగును కలుపుతుంటారు. ఆ కల్తీని మీ ఇంట్లోనే గుర్తించవచ్చు.

కల్తీ కుంకుమ పువ్వు గుర్తించడమెలా?

స్వచ్చమైన కుంకుమ పువ్వు అంత తేలిగ్గా విరిగిపోదు. కల్తీ అయినది అయితే త్వరగా విరిగిపోతుంది.

దీన్ని గుర్తించేందుకు ఒక గ్లాస్‌లో నీటిని తీసుకోవాలి. అందులో కొంత కుంకుమ పువ్వు వేయాలి.

ఒకవేళ ఆ పువ్వు స్వచ్చమైనది అయితే, అది నీటిలో పూర్తిగా కరిగే దాకా దాని రంగు అలాగే ఉంటుంది.

కల్తీ జరిగి ఉంటే, వెంటనే ఆ రంగు నీటిలో కరిగిపోతుంది.

vartha nerthram

Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్