చట్టాల సవరణకు సిద్దం... అమిత్ షా...
దిల్లి: త్యాచారం వంటి తీవ్ర నేరాల్లో న్యాయం ఆలస్యం అవుతుండడంతో ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలను సవరించాలని ప్రభుత్వం సంకల్పించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు. ఈ విషయమై చట్టంలో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందని సలహాలు కోరుతూ రాష్ట్రాలకు లేఖ రాసిన తర్వాత రోజే అమిత్‌షా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. పుణెలో నిర్వహించిన 54వ డీజీపీ, ఐజీపీల సదస్సుకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత ప్రజాస్వామ్యానికి అనుకూలంగా హత్యాచారం వంటి తీవ్రమైన నేరాల్లో శిక్ష ఆలస్యం కాకుండా ఉండేలా చట్టాల్లో సవరణలు చేయాల్సిన విషయాన్ని అమిత్‌షా నొక్కిచెప్పారు. ప్రతి రాష్ట్రంలో అనుబంధ కళాశాలలతో ఆల్ ఇండియా పోలీస్ యూనివర్శిటీ, ఆల్ ఇండియా ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ ప్రారంభించేందుకు యోచిస్తున్నట్లు చెప్పారు. అందరూ పోలీసులు ఒక తాటిపైకి వచ్చి జాతీయ భద్రతకు తీసుకోవాల్సిన నిర్ణయాలను తెలియజేయాలని కోరారు. డీజీపీ, ఐజీపీల సదస్సు చివరి రోజైన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఎన్‌ఎస్‌ఏ అజిత్ డోభాల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
గతవారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అత్యాచారం, హత్య వంటి తీవ్ర నేరాల్లో వెంటనే న్యాయం జరిగేలా ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల్లో సవరణలు చేయనున్నట్లు చెప్పారు. మరోవైపు శనివారం జోధ్‌పూర్‌లో జరిగిన హైకోర్టు భవన ప్రారంభ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే మాట్లాడుతూ.. న్యాయం ప్రతీకారం తీర్చుకోవడంలా ఉండకూడదని అన్నారు. అలా ఉంటే అది సహజత్వాన్ని కోల్పోతుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నలుగురు అత్యాచార నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత రోజు సీజేఐ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Comments
Post a Comment