భద్రత ఉల్లంఘనపై స్పందించిన వాద్రా

భద్రత ఉల్లంఘనపై స్పందించిన వాద్రా



దిల్లీ: కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ నివాసం వద్ద భద్రతా ఉల్లంఘనపై ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా స్పందించారు. దేశవ్యాప్తంగా పౌరులకు భద్రత కరవైందని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి వ్యక్తి భద్రత ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ''ప్రియాంక, నా కుమార్తె, నా కొడుకు లేదా గాంధీ కుటుంబ భద్రత అన్నది ఇక్కడ విషయం కాదు. మన పౌరులకు ముఖ్యంగా మన మహిళలకు భద్రత కల్పించి.. వారు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బాలికలపై తరచూ దాడులు జరుగుతున్నాయి. మనం ఎలాంటి సమాజాన్ని తయారుచేస్తున్నాం? దేశంలోని ప్రతి పౌరుడి భద్రత ప్రభుత్వ బాధ్యత. మన దేశంలో, ఇంట్లో, బయటా భద్రత లేదు. పగలు, రాత్రి సురక్షితంగా ఉండలేని పరిస్థితి. ఇక మనకు ఎప్పుడు, ఎక్కడ భద్రత ఉంటుంది?'' అని వాద్రా ఫేస్‌బుక్‌ వేదికగా ప్రశ్నించారు.


గుర్తుతెలియని ఏడుగురు వ్యక్తులు గతవారం ఒక కారులో ప్రియాంక ఇంటి ప్రాంగణంలోని ద్వార మంటపం వరకూ వెళ్లారు. అంతేకాకుండా కిందకి దిగి, నేరుగా ప్రియాంక వద్దకు వెళ్లి, తమతో ఫొటో దిగాలని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చొరబాటుదారుల్లో ముగ్గురు చొప్పున పురుషులు, మహిళలు, ఒక బాలిక ఉన్నట్లు పేర్కొన్నాయి. వారితో ప్రియాంక మర్యాదగానే మాట్లాడారని, ఫొటోలు దిగి పంపేశారని తెలిపాయి. ఈ విషయాన్ని ఆమె కార్యాలయం సీఆర్పీఎఫ్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించాయి. గత నెల 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాంధీ కుటుంబానికి ప్రత్యేక భద్రతా దళ రక్షణను ఉపసంహరిస్తూ కేంద్ర ప్రభుత్వం నవంబర్‌లో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వారికి సీఆర్పీఎఫ్‌ ఆధ్వర్యంలో 'జడ్‌ ప్లస్‌' భద్రత కల్పించింది.


Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్